29-11-2025 01:13:27 AM
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే కార్యవర్గం రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగిసి 18నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ పొడిగింపు స్టిక్కర్లతోనే సమాచారశాఖ కాలం గడుపుతోందని పే ర్కొంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అక్రిడిటేషన్ పాలసీని ప్రకటించకపోవడం జర్నలిస్టులపై ప్రభుత్వానికున్న వైఖరికి నిదర్శనమని హెచ్‌యూజే పేర్కొంది.
శుక్రవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో హెచ్‌యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన ఆ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలపై నాయకులు కూలంకుషంగా చర్చించారు. జర్నలిస్టులకు ఇండ్ల జాగాల విషయంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు న్యాయంచేసేలా ప్రత్యేకపాలసీ తీసుకు రావాలని హెచ్‌యూజే కార్యవర్గం రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరింది.
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యచికిత్సలు అందేలా హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్‌చేసింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షుడు, అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుడిగ రఘు మాట్లాడుతూ... కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చే శారు. ఈ సమావేశానికి హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి రాజశేఖర్, హెచ్‌యూజే ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు మధుకర్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.