25-08-2025 12:00:00 AM
జిన్నారంలో కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు
పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 24 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును తెలంగాణ హైకోర్టు జడ్జిలు సూరేపల్లి నంద, అనీల్ కుమార్ జూకంటి ఆదివారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని ఐకేపీ వెలుగు భవనాన్ని కోర్టు కోసం కేటాయించి అనుకూల మార్పులు చేశారు. జిన్నారం, గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, హత్నూర పోలీస్ స్టేషన్లు కోర్టు పరిధిలోకి వస్తాయి.
కోర్టు భవనాన్ని ప్రారంభించిన అనంతరం శిలాపలకాన్ని హైకోర్టు జడ్జిలు ఆవిష్కరించారు. హిందు, ముస్లీం, క్రిస్టియన్ పద్దతిలో కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. కోర్టు ప్రారంభించిన అనంతరం పది కేసుల కాల్ వర్క్ను జడ్జిలు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు జడ్జి సూరేకంటి నంద మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి జిల్లా కోర్టు నుంచి జిన్నారం కోర్టుకు 2200 కేసులు బదిలీ చేసినట్లు చెప్పారు.
అనంతరం హైకోర్టు జడ్జి అనీల్ కుమార్ జూకంటి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కోర్టు ఎలా ప్రారంభమైందో వివరించారు. అనంతరం జిల్లా జడ్జి భవాని చంద్ర మాట్లాడుతూ జిన్నారంలో కోర్టు భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయింపు జరిగిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడారు. అనంతరం సంగారెడ్డి, నర్సాపూర్ న్యాయవాదులు హైకోర్టు జడ్జిలు, జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీలకు పుష్పగుచ్చం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, నర్సాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మహేశ్ కుమార్, భూపాల్ రెడ్డి, అంజిరెడ్డి, జాఫర్, ఏజీపీ సుధాకర్, నర్సాపూర్ పీపీ రాఘవేందర్, ఎం. శంకర్ రెడ్డి, జిన్నారం, గుమ్మడిదల మండలాల నాయకులు, ప్రజలుపాల్గొన్నారు.