పెట్టుబడుల రైజింగ్‌కు కృషిచేయాలి
- ఆ దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలి
- పరిశ్రమలశాఖ సమీక్షలో సీఎస్ రామకృష్ణరావు
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషిచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమలశాఖ అధికారులతో, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లతో సోమవారం సచివాలయంలో పరిశ్రమలశాఖపై ఆయన సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబ డులు పెట్టడానికి వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నారని, ఆ దిశలో పరిశ్రమలశాఖ అధికార యంత్రాంగం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, తగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని పారిశ్రామికవేత్తలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంవో యూలతోపాటు పెట్టుబడిదారులకు అవసరమైన ఇతర మౌలిక వసతులను సమకూర్చాల న్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలతోపాటు ఆయా రంగాలలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహ కాలను కూడా పెట్టుబడుదారులకు తెలియజేసి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాలని తెలిపారు. భారీ పెట్టుబడులతోపాటు స్థానిక యువతకు అధిక స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర ఐటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ ఉత్పత్తుల రంగాల్లో కూడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.






