7 July, 2026 | 2:21 AM

మంత్రాల చెరువు పరిరక్షణకు కృషి

07-07-2026 12:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట్, జూలై 6 (విజయక్రాంతి): మీర్పేట్ డివిజన్ పరిధిలోని మంత్రాల చెరువులో విస్తారంగా పేరుకుపోయిన గుర్రపు డెక్క (వాటర్ హైసింథ్) కారణంగా దుర్వాసన వెదజల్లుతూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, చెరువులో గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి, భవిష్యత్తులో మురికి నీరు చెరువులోకి చేరకుండా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల పరిరక్షణ ప్రజారోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి హయాంలో కోట్ల రూపాయలతో అందంగా అభివృద్ధి చేసిన చెరువులు నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురికికూపాలుగా మారుతున్నాయి. కేసీఆర్ గారి పేరు చెరిపివేయాలనే ప్రయత్నాలు ఎంత చేసినా, ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ మరవరు.

కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అర్కల భూపాల్ రెడ్డి,  దీప్లాల్ చౌహాన్,అనిల్ యాదవ్, అర్కల  కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, రాజ్ కుమార్, మదారి రమేష్, శీను నాయక్, గోపి యాదవ్, ప్రభాకర్ రెడ్డి, అవినాష్, వీర రాఘవరెడ్డి, సునీత బాలరాజ్, పంతంగి మాధవి, బిందు, నిర్మలారెడ్డి తదితరులు  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రూ.20 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

నాదర్గుల్ 57వ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ ఆదిత్య నగర్ కాలనీ (ఫేజ్ 3)లో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అభివృద్ధి పనులను అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి హయాంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి కార్పొరేషన్కు రూ.50 కోట్ల నిధులు, మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున కేటాయించి, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అట్టి  నిధులు నిలిపివేశారని  ప్రస్తుతం ఆ నిధులను విడుదల చేయకుండా నిలిపివేయడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం మానుకుని, ఆనాడు మంజూరైన స్పెషల్ డెవలప్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి, పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుర్రం సాయికిరణ్ రెడ్డి, ముత్యం రెడ్డి, రామిడి రామిరెడ్డి, సత్తిరెడ్డి పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు , కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.