18-07-2025 08:15:57 AM
హుజూర్ నగర్: గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ(Secretary of Tribal Welfare Society) సీతాలక్ష్మి పేర్కొన్నారు. మేళ్లచెరువు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేవని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ సీతాలక్ష్మి గురువారం పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో నేరుగా సమావేశం నిర్వహించి గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గురుకుల భవనాన్ని పరిశీలించి సమస్యలన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.ప్రస్తుతం గురుకుల పాఠశాల ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నందున యజమాని అహ్మదుతో మాట్లాడి పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
విధులలో నిర్లక్ష్యం వహించినందున గురుకుల నిర్వహణ విద్యార్థుల నుండి వచ్చిన వివిధ ఆరోపణలపై గురుకుల ప్రిన్సిపల్ మురళిని సెక్రెటరీ సీతాలక్ష్మి సస్పెండ్ చేశారు.వైస్ ప్రిన్సిపల్ మధుకర్ కు తాత్కాలిక ప్రిన్సిపల్ గా బాధ్యతలు ఇచ్చారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మిషన్ భగీరథ అధికారులు గురుకుల పాఠశాలను పరిశీలించి త్రాగునీటి కల్పనకు కావలసిన పైపులైన్లను అంచనా వేయగా పరిశీలించిన సెక్రటరీ రెండు లక్షల రూపాయలు మిషన్ భగీరథ నీటి కొరకు మంజూరు చేశారు.అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ రీజియన్ సమన్వయకర్త బలరాం,వైస్ ప్రిన్సిపల్ మురళీధర్,విజిలెన్స్ ఆఫీసర్ నటరాజ్ ,అకౌంట్ సెక్షన్ రవికుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ కాంతారాజు, అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.