20 April, 2026 | 5:51 PM

సీఆర్‌టీల కంటిన్యువేషన్ ఉత్తర్వులపై హర్షం

20-04-2026 05:06 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్‌టీల కంటిన్యువేషన్ ఉత్తర్వులు జారీ కావడం పట్ల టీఎస్టీడబ్ల్యూ మరియు సీఆర్‌టీల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సంయుక్త పత్రిక ప్రకటనలో సీఆర్‌టీలకు నెలల తరబడి వేతనాలు రాక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. జిల్లాలో 460 పోస్టులు ఉండగా 426 మందికే ఉత్తర్వులు ఉండటంతో 34 మంది సీఆర్‌టీలకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందలేదని పేర్కొన్నారు.

ఈ సమస్యను గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఆర్.రమాదేవి దృష్టికి తీసుకెళ్లగా, టీఎస్టీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి జి. అశోక్ ఆధ్వర్యంలో అధికారులతో చర్చించి కంటిన్యువేషన్ ఉత్తర్వులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా సహకరించిన డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, ఆర్. రమాదేవి, ఎస్‌ఓలు జనార్దన్ రెడ్డి, రాజేందర్, రోషన్లకు సీఆర్‌టీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఆర్‌టీల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమరల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి జర్పుల విజేష్, టీఎస్టీడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శి మడావి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.