13-11-2025 12:00:00 AM
ఘట్ కేసర్, నవంబర్ 12 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ లోని సుప్రభాత్ టౌన్ షిప్ లో నివసిస్తున్న వయోధికులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుధవారం ప్రజాకవి, రచయిత అందెశ్రీ మరణించిన సందర్బంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి సంతాపం ప్రకటించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్, తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి తోట రంగయ్య ప్రసంగిస్తూ అందెశ్రీ గా పేరు గడించిన అందె ఎల్లయ్య చదువులేకున్న తన ప్రతిభతో కొమ్మ చెక్కితే బొమ్మరా, గల గల గజేల్ల బండి, పల్లె నీకు వందనాలు, “మాయ పోతున్నాడమ్మ మనిషన్నవాడు” అని హృదయాలను కదిలిచిందని రాష్ర్ట సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ పాటను రచించిన గొప్ప గేయ రచయిత అని కొనియాడారు.
అందెశ్రీ మరణం తెలంగాణ తీరనిలోటని, ఆయన పేరు చిరస్థాయిలో ఉండాలంటే ఆయన జన్మించిన సిద్దిపేట జిల్లాను “అందెశ్రీ సిద్దిపేట” జిల్లాగా నామకరణం చేయాలని, అంతిమ యాత్ర జరిగిన ఘట్ కేసర్ వద్ద వరంగల్ హైవేలో కాంస్య విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. ఈకార్యక్రమంలో వి. ఇన్నారెడ్డి, పి. యాది రెడ్డి, జి. పోచిరెడ్డి, ముత్యాల గౌడ్, జి.వి.రాజిరెడ్డి, కె. బీరయ్య, ఎం. రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.