26-11-2025 09:37:38 PM
ఫిర్యాదుల పరిష్కారం మూడు రోజుల్లోనే
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
సిద్దిపేట కలెక్టరేట్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరుగుతుందన్నారు. టి-పోల్ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల జియో-లోకేషన్ వివరాలు నవీకరించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, ర్యాంపులు, భద్రత వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
నామినేషన్లను నవంబర్ 27 నుండి 29 తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించాలని ఆదేశించారు. ప్రచార కరపత్రాల ముద్రణ అనుమతి లేకుండా జరగకుండా సెక్షన్ 216 టిపిఆర్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఫ్లైయింగ్ స్క్వాడ్, ప్రతి జిల్లాకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని, ఎంసీసీ అమలులో నగదు, బంగారం సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.