calender_icon.png 26 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలి

26-11-2025 08:50:46 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి క్రైమ్ : గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు 27వ తేదీన ఉదయం 10 గంటలకల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతి మొదటి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గ్రామ పంచాయతి మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం ఉదయం 10 గంటలకల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని ఆర్వోలకు ఆదేశించారు.

అభ్యర్థులు నామినేషన్లను వేసినప్పుడు వారి నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరి కంటే ఎక్కువ రిటర్నింగ్ అధికారి గదిలోకి రావడానికి అనుమతించవద్దని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కరదీపికలో ప్రతి ఒక్క పేజీని తప్పకుండా చదవి, అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ లో నిర్దేశించిన సూచనల మేరకే విధులను జాగ్రత్తగా నిర్వహించాలని తెలియజేశారు.

నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు నిర్దేశించిన పత్రాలు తీసుకురాకపోతే వారి నామినేషన్ తిరస్కరించకుండా వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని సూచించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను జాగ్రత్తగా పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు ప్రకారమే నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీపీవో తరుణ్, డి ఎల్ పీ ఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, టి వో టి శ్రీనివాసులు, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.