26-11-2025 08:52:20 PM
జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి
వనపర్తి క్రైమ్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 15 మండలాల్లోని 268 గ్రామ పంచాయతీలు, 2436 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 27 నుండి 29వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చని, ఉదయం 10-30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్దేశించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించారు.
పోటీ చేసే అభ్యర్థులకు గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఉండాలి అనే నిబంధన ఈ ఎన్నికల్లో ఎత్తివేయడం జరిగిందని, పిల్లలతో నిమిత్తం లేకుండా నామినేషన్ దరఖాస్తులు స్క్రూటినీ చేసే రోజు నాటికి 21 సంవత్సరాల కనీస వయసు ఉన్నవారు నామినేషన్ వేసుకోవచ్చు. నామినేషన్ వేయడానికి సర్పంచి కి రూ. 2000, వార్డు మెంబరుకు 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సర్పంచి కి 1000, వార్డు మెంబర్ కు 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 5000 జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచు రూ.2,50,000 లు ఎన్నికలకు ఖర్చు చేసే పరిమితి ఉందని, అంతకన్నా తక్కువ జనాభా ఉంటే 1,50,000 వరకు పరిమితి ఉందన్నారు.
వార్డు నెంబరు 5వేల జనాభా మించితే రూ. 50,000 వరకు ఖర్చు చేయవచ్చు, అంతకన్న తక్కువ జనాభా ఉంటే రూ. 30,000 వరకు మాత్రమే ఖర్చు చేసేందుకు అవకాశం ఉన్నది. పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా రిజిస్టర్ బ్యాంకులో కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఖాతా నుంచి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ప్రచారానికి చేసే ఖర్చులకు ఏ ప్రచార సామాగ్రికి ఎంత లెక్కించడం జరుగుతుందో జాబితా ఇవ్వడం జరిగింది. పత్రికల్లో ప్రచారం ఇవ్వాలనుకునే వారు పోలింగ్ కు 48 గంటల ముందు వరకు స్వంతంగా చేసుకోవచ్చని, పోలింగ్ ముందు రోజు లేదా పోలింగ్ రోజు పత్రికల్లో ప్రచారం చేయడానికి ముందుగానే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
కలెక్టరేట్ లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు లేదా సమాచారం పొందటానికి కలెక్టరేట్ లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ 08545-233525 కు ఫిర్యాదు చేయవచ్చు లేదా సమాచారం పొందవచ్చు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిపిఓ తరుణ్ చక్రవర్తి, డివిజనల్ పి ఆర్ ఓ రఘునాథ్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజెపి నుంచి పెద్దిరాజు ఏఐఎంఐఎం నుండి ఎం.ఏ. రహీం, టిడిపి నుంచి ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ జి. ధర్మన్న, కాంగ్రెస్ నుండి ఎన్ త్రినాథ్, రాజేందర్, సిపిఐ (ఎం) పుట్ట ఆంజనేయులు, టిఆర్ఎస్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.