26-11-2025 09:03:59 PM
గద్వాల : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల తహసిల్దార్లతో ఎన్నికల విధులకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయా మండలాల్లోని ఎంపీడీవోలకు ఎన్నికల్లో సహకరించేందుకు తహసిల్దార్లకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్లు సహకరించాలని అన్నారు. ఎన్నికల్లో అవసరం మేరకు జిపిఓ లకు విధులు కేటాయించి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమవుతున్నందున ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ చేయకూడదని, ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణంలో ఉన్న వాటికి ఇబ్బంది లేదన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని (MCC)ని అనుసరించి ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలపై, విద్యుత్ పోల్స్, నియంత్రికల గోడలపై ఎలాంటి రాజకీయ పార్టీల ప్రచార రాతలు రాయకూడదని, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన పోస్టర్స్ అతికించరాదని తెలిపారు. ప్రైవేటు భవనాలపై పోస్టర్స్ అతికించడం, ప్రచార రాతల విషయంలో సంబంధిత యజమానుల అనుమతి తప్పకుండా తీసుకునేలా అభ్యర్థులకు సూచించాలన్నారు. అభ్యర్థులు తిరిగేందుకు వాహనాల అనుమతి సంబంధిత తహసిల్దార్లు ఇవ్వాల్సి ఉంటుందని, వార్డు సభ్యులుగా పోటీ చేసే వారికి అవసరం లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు చీరల పంపిణీ, ఇతరాత్ర ప్రలోభాలకు గురి చేయకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కు 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ముగించేలా అభ్యర్థులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తహసిల్దారులు మిగతా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, డిపిఓ నాగేంద్రం, ఆయా మండలాల తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.