06-12-2025 04:25:08 PM
* ఒకే గొడుగు కింద ఉన్న వారిలో పోటీ
* నువ్వా.. నేనా.. సై అంటున్న అభ్యర్థులు
* విందులు, సంఘాలతో ఒప్పందాలు
* ఎన్నికల వేళ కిక్కే కిక్కు..
పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సమరంలో అసలైన ఘట్టమైన పోలింగ్ సమీపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో తలామునకలవుతున్నారు. పలుచోట్ల ఎక్కువమంది బరిలో ఉండడంతో ఫలితం ఎలా వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. సునాయాసంగా గెలిచే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఒకే వర్గం నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న భయం వెంటాడుతోంది. మొన్నటి వరకు ఒకే గొడుగు కింద ఉన్న వారంతా ఇప్పుడు పోటీకి సై అనడంతో చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బృందాలుగా వీడి ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. చివరి సమయం వరకు అధినాయకులు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలించలేవు. ఎవరు గెలిచినా మన గూటి పక్షులే కదా అన్న భావన కూడా ముఖ్య నేతల్లో నెలకొంది. ఇక అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
మండలంలోని పలు మేజర్ పంచాయతీల్లో అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో విందులు జోరుగా సాగుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ వెలువడినప్పటి నుంచే వీటికి తెరలేపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పలు గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సామాజిక వర్గం పేరిట హామీలు ఇస్తూ వలలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రహస్యంగా ఒప్పందాలు కుదిరాయి. ఇక యువతకు ఏవేవో చెబుతూ ఆకర్షిస్తున్నారు. ఎవరికి ఏది అవసరమో అది గుర్తించి అందజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలడని అనుకుంటున్నారో వారికే తమ ఓటు వేస్తామని కొందరు చెబుతున్నారు.
ఎన్నికల వేళ కిక్కే కిక్కు
మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో కొందరు ఓటర్లకు కిక్కు ఎక్కిస్తున్నారు. నిశి రాత్రిలో 'నిషా'ను తలకెక్కిస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఐదు నుంచి పది ఓట్లు ఉన్న వారి కుటుంబాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పల్లె పోరు కావడంతో బలగం.. బలం.. కులాలపై ఎన్నికలు సాగుతున్నాయి. రిజర్వేషన్ల లోని మెజారిటీ స్థానాలు తక్కువ ఖర్చుతోనే బయటపడే వీలుండగా జనరల్ స్థానాల్లోనే డబ్బుల పంపిణీకి తెరతీసే అవకాశం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ మంచిని గెలిపించి.. పల్లెకు పండుగ చేద్దామని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కంకణబద్ధులై ఉన్నారు. మరో 5 రోజులు వేచి చూడాల్సిందే.. ఎవరికీ పట్టం కట్టబెడతారోనని.