01-12-2025 08:06:43 PM
చివ్వెంల (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో రెండో విడతగా జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. చివ్వెంల మండల కేంద్రంతో పాటు చందుపట్ల గ్రామంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ, నామినేషన్ల స్వీకరణ, పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. ఎస్పీ నరసింహ గ్రామ ప్రజలు, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో సమావేశమై ఎన్నికలు పూర్తిగా ప్రశాంత, ప్రజాస్వామ్య వాతావరణంలో జరగడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచిస్తూ...
ఎస్పీ కీలక సూచనలు:
ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు (డబ్బు, మద్యం, బహుమతులు) లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి.
పోటీదారులు ప్రజలను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు దూరంగా ఉండాలి.
గ్రామాల్లో శాంతి భద్రతలు భంగం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
బైండోవర్‌ను ఉల్లంఘిస్తే ₹2 లక్షల నుండి ₹5 లక్షల వరకు పూచీకత్తు నగదు విధించనున్నట్లు తెలిపారు.
ఒకే గ్రామానికి చెందిన వారు పోటీ పడతారని, కాబట్టి వ్యక్తిగత విమర్శలు, గుంపులుగా చేరి ఉద్రిక్తతలు సృష్టించడం నివారించాలన్నారు.
ఎన్నికల రోజు ముందుగా 44 గంటల పాటు ప్రచారం నిషేధం అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎవరూ గుంపులు గూడరాదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో శాంతి, సవ్యమైన నిర్వహణ కోసం ప్రజలు, పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులందరూ పరస్పరం సహకరించాలని ఎస్పీ కోరారు.
ఈ సందర్శనలో ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, చివ్వెంల ఎస్సై మహేష్, పోలీసులు పాల్గొన్నారు.