01-12-2025 07:58:52 PM
బజార్‌హత్నూర్ (విజయక్రాంతి): బజార్‌హత్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమయ్యే ఇసుక లభ్యం కాక 70% నిర్మాణలు అరకొరగా సాగుతున్నాయి. దీంతో ఈ పరిస్థితి అదిగమించేందుకు సోమవారం మండల తహసీల్దార్ శ్యామ్ సుందర్ కు ఏఐటీయూసీ అధ్వర్యంలో లబ్ధిదారులు వినతిపత్రం అందించారు. ఇసుక తెచ్చుకునేందుకు వాయిపేట్ అటవీ ప్రాంతం ఒకటే దిక్కు అని, ఇక్కడ నుంచే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తారనీ ఏఐటీయూసీ నాయకులు కీర్తి రమణ తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభం కాక మునుపు ఒక ట్రాక్టర్ ఇసుకను రూ. 5,000 నుంచి రూ. 5,500 వరకు అమ్మేవారన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలు ఎప్పుడైతే ప్రారంభం అయ్యాయో అటవీ అధికారులు అనుమతులు లేవని సాకు చూపుతూ ట్రాక్టర్ ల వారు ఇసుక ధరను విపరీతంగా పెంచేశారని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కారణంగా పేదలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకోలేక పోతున్నారని అన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే ఇసుకను కొనలేక సతమతం అవుతున్నారు. ఈ విషయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అటవీ అనుమతులు ఇప్పించి, తగు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని తహసీల్దార్ తెలిపారన్నారు. సిపిఐ మండల కార్యదర్శి రవీందర్, అధ్యక్షులు రఘునాథ్, పలువురు భవన నిర్మాణ కార్మికులు, ఏఐటీయూసీ సభ్యులు తదితరులు తెలిపారు.