19-12-2025 07:30:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు, అధికారులు సహకారం అందించడం వలన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ... ఎన్నికల భద్రత దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం సుమారు 900 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విడతలవారీగా విధులు నిర్వహించినట్లు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునుంచే జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 12 చెక్‌పోస్టుల వద్ద వాహనాలపై క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో, ప్రత్యేక నిఘా కొనసాగించామని తెలిపారు. ఈ తనిఖీల్లో రూ. 14,67,700 నగదు, రూ. 7 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, వివిధ చట్టవిరుద్ధ చర్యలకు సంబంధించి పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అదనంగా, గత ఎన్నికల్లో ఘర్షణలకు కారణమైన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై ముందస్తు చర్యలుగా 151 కేసుల్లో *201 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో చలి, పగలు–రాత్రి అన్న తేడా లేకుండా కర్తవ్యదీక్షతో పనిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు, వివిధ శాఖల అధికారులు, పోలీసు విభాగం సమన్వయంతో పనిచేయడంతోనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలియ జేశారు.