4 March, 2026 | 1:11 PM

అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ వెలుగులు

04-03-2026 12:00 AM

ఎస్‌ఈ వి గంగాధర్ 

కరీంనగర్, మార్చి 3 (విజయ క్రాంతి): పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపే అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలక  పాత్ర పోషిస్తోంది. సర్కిల్ పరిధిలో  ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ లేని అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ గంగాధర్  తెలిపారు . ఇప్పటివరకు 105 అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడి కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను  గుర్తించి,  కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు.

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా  విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్,  ఇతర సదుపాయాలు వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని, ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో గానో దోహదపడుతుందని తెలిపారు.విద్యుత్ వెలుగులతో అంగన్వాడి కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, తదితర పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని ఎస్‌ఈ వి గంగాధర్ తెలిపారు.