మహిళలు అన్ని రంగాల్లో స్వశక్తితో ఎదగాలి
జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమలా సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 3 : మహిళలు స్వశక్తితో చదువుల్లో, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమలాసుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగోల్ డివిజన్ పరిధిలోని పీఎంఆర్ గార్డెన్స్ లో మంగళవారం మహిళా దినోత్సవాన్ని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, నుకాల పద్మారెడ్డి సంయుక్తంగా తెలంగాణ ప్రగతిశీల మహిళా సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారని, మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదని, ప్రతి రోజూ మహిళల రోజే అన్నారు.
భగవంతుడు అంతటా ఉండలేక తన రూపంలో మహిళను సృష్టించాడని, మహిళ కుటుంబంతోపాటు సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. తల్లిదండ్రుల నుంచే ఆడపిల్ల గురించి ఆలోచనల్లో మార్పు రావాలని, మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అనంత రం వివిధ విభాగాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, బీఆర్‌ఎస్ డివిజన్ల మహిళా అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.




