07-10-2025 12:37:02 AM
-గ్రీన్ ఫీ నిధులతో ఈవీ డిపోల ఏర్పాటు
-ఈవీలతో హైదరాబాద్‌లో శబ్ద, వాయు కాలుష్యానికి తెర
-రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం
-నగరంలో డీజిల్ ఆర్టీసీ బస్సులతో ప్రతిరోజూ 600 టన్నుల కర్బన ఉద్గారాలు
-విడతల వారిగా ‘డీజిల్’ స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు
-ఓఆర్‌ఆర్ బయటకు డీజిల్ బస్సులు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో హైదరాబాద్ నగరం పూర్తిగా కాలుష్యమయం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఢిల్లీ ప్రజారవాణాలో డీజిల్ బస్సులను తొలగించి, సీఎన్జీ, ఈవీ బస్సులను ప్రవేశపెట్టిన విధంగానే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టి, డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) బయటకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను పట్టి పీడిస్తున్న సమస్య వాహనాల రొద. వాటి నుంచి వెలువడే కాలుష్యం. దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అందుకు మినహాయింపేమీ కాదు. రోజురోజుకూ హైదరాబాద్‌కు పెరుగుతున్న వలసలు, జనాభా, వాహనాలతో హైదరాబాద్‌లో శబ్ద, వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ప్రస్తుతం 265.. మూడేండ్లలో 2,800 ఈవీ బస్సులు
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 265 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో 275 ఈవీ బస్సులు రానుండగా, వచ్చే మూడేండ్లలో 2,800 ఈవీ బస్సులను హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టే విధంగా ప్రణాళికను రచించారు. వీటికి అవసరమైన ఈవీ డిపోలు, ఈవీ బస్సుల ఛార్జింగ్ కోసం హైటెన్షన్ విద్యుత్తు లైన్ల కనెక్షన్ల నిర్మాణాన్ని ఆర్టీసీ చేపట్టనుంది. ఇందుకు రూ.వేల కోట్లు వ్యయం అవతుందని, ఇందులో కొంత మొత్తాన్ని గ్రీన్ ఫీ రూపంలో ఆర్టీసీ సమకూర్చుకోనుంది.
డీజీల్ బస్సుల కాలుష్యం
హైదరాబాద్ నగరం ఆర్టీసీ పరిధిలో 2,926 డీజిల్ బస్సులు, 265 ఈవీ బస్సులు ప్రస్తుతం ఉన్నాయి. ఒక్కో డీజిల్ బస్సు రోజుకు 2.15 కిలోల కర్బన ఉద్గారాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయి. నగరంలో ఉన్న మొత్తం డీజిల్ బస్సులతో ప్రతిరోజూ సుమారు 600 టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలో చేరుతున్నాయి. డీజిల్ బస్సులు పాతవి కావడంతో శబ్ద కాలుష్యం ప్రజల చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాయి. ఈ డీజిల్ బస్సులను ఓఆర్‌ఆర్ బయటకు తరలించి ఈవీలను ప్రవేశపెడితే శబ్ద, వాయి కాలుష్యాలు చాలా వరకు తగ్గుతాయనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది.
గ్రీన్ ఫీ రూపంలో ఏడాదికి రూ.110 కోట్లు
ఈవీ బస్సుల కోసం డిపోలు ఏర్పాటు చేయాలి. అలాగే ఛార్జింగ్ కోసం హైటెన్షన్ విద్యుత్తును అనుసంధానించాలి. దీనికోసం రూ.వేల కోట్ల భారం ఆర్టీసీపై పడనుంది. నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ 24.37 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇందులో 18.28 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. అంటే ప్రతిరోజూ ప్రయాణించేవారిలో సుమారు 75 శాతం మహిళలే. వీరి ప్రయాణ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.
మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు పెరిగి ఆర్టీసీకి ఆదాయం పెరిగినా.. డీజిల్ బస్సులతో శబ్ద, వాయు కాలుష్యంకూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, వాటి మౌలిక వసతుల ఏర్పాటుకు ఆర్టీసీ వనరుల సమీకరణకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా ఆర్టీసీ ప్రయాణీకుల నుంచి గ్రీన్ ఫీ వసూలు చేయాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీగా రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల్లో 75 శాతం మహిళలే ఉండటంతో ఆ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. గ్రీన్ ఫీ ద్వారా ఏడాదికి రూ.110 కోట్లు, రెండేండ్లకు రూ.220 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.
బస్ డిపోలు.. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు
ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిస్థాయిలో నడపాలంటే బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించాలి. ఇప్పటికే నగరంలో జీహెచ్‌ఎంసీ, జేబీఎస్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, మియాపూర్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లకు హైటెన్షన్ విద్యుత్తు (హెచ్‌టీ) కనెక్షన్ కావాలి. ఒక్కో డిపోలో హెచ్‌టీ కనెక్షన్‌కు రూ.10 కోట్లు ఖర్చవుతుంది. నగరంలోని అన్ని డిపోలకు హెచ్‌టీ కనెక్షన్ల కోసం రూ. 392 కోట్లు అవసరం. గ్రీన్ ఫీ ద్వారా ఆర్టీసీకి సమకూరేది రెండేండ్లలో రూ.220 కోట్లు మాత్రమే. అయినప్పటికీ మిగిలిన భారాన్ని కూడా భరించేందుకు ఆర్టీసీ సిద్ధపడింది. దీంతోపాటు ఈవీ బస్సుల కొనుగోలు వ్యయం దీనికి అదనం. అయినప్పటికీ ప్రయాణికుల సేవ, పర్యావరణ పరిరక్షణ కోసం ఆ భారాన్ని మోసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతున్నది.