22 August, 2026 | 7:00 AM

తూడుకుర్తిలో చిరుత సంచారం

23-05-2024 01:20 AM

గంగారం అటవీప్రాంతం నుంచి జింకలను వేటాడుతూ

అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన

నాగర్‌కర్నూల్ మే 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం తూడుకుర్తి, గంగారం గ్రామ ప్రజలు పంట పొలాలకు వెళ్లి వస్తుండగా జింకను తరుముతూ చిరుతపులి కనిపించిందని, వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నాగర్‌కర్నూల్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఫర్వేజ్ అహ్మద్ సిబ్బందిని గ్రామానికి పంపించారు. అయితే అక్కడ చిరుత అడుగుజాడలు కనిపించలేదని తెలిపారు. గంగారం అటవీప్రాంతంలో సోలార్ బోర్ల వద్దకు జింకల గుంపులు ఎక్కువగా వస్తుంటాయని వాటికోసం నాలుగు చిరుతలు తిరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే జింకలను తరుముతూ గంగారం అటవీ ప్రాంతంలోని బీమునితండా, కీమ్యాతండా, శాయినిపల్లి తండా, నేరేడు వంపుల శివారు పంటపోలాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన పరిసరాల్లోని అటవీప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని అటవీ శాఖాధికారులు సూచించారు. తూడుకుర్తిలో చాటింపు వేయించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు.