29 May, 2026 | 2:04 AM

జోరుగా ఉపాధి హామీ పనులు

29-05-2026 12:51 AM
  1. మంత్రి సీతక్క వరుస సమీక్షలతో కూలీల హాజరులో పెరుగుదల
  2. రోజుకు16 లక్షలకు చేరిన కూలీల సంఖ్య

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క వరుస సమీక్షలతో ఉపాధి పనుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతిరోజూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్డీఓలు), ఎంపీడీఓలతో పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 16 లక్షల మంది కూలీలు ఉపాధీ హామీ పనులకు హాజరవుతున్నారు. మే మొదటి వారంలో 7 లక్షల పరిధిలో ఉన్న హాజరు, క్రమంగా పెరిగి ఇప్పుడు 16.24 లక్షలకు చేరడం ప్రభుత్వ చొరవకు నిదర్శనంగా నిలిచింది.

కూలీల హాజరు తక్కువగా ఉన్న జిల్లాలు, మండలాలను ప్రత్యేకంగా గుర్తించి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి ప్రతి కూలీకి పని అందేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షల్లో కొన్ని జిల్లాలు అద్భుత ప్రదర్శన కనబరుస్తుండగా, మరికొన్ని జిల్లాలు ఇంకా మెరుగుదల అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలు మంచి పురోగతి సాధించాయి.

నల్గొండ జిల్లాలో ప్రతి రోజు ఏకంగా 1.23 లక్షల మందికి పైగా కూలీలు పనులకు హాజరుకావడం విశేషం. కూలీల సంఖ్య కాస్త తక్కువగా ఉంటున్న గద్వాల్, రంగారెడ్డి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూలీల హాజరు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పని అడిగిన ప్రతి కుటుంబానికి పని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, ఏ గ్రామంలోనూ పని లేకుండా ఉండకూడదని, అందుకే అధికారులను ప్రతిరోజూ సమీక్షిస్తూ కూలీల హాజరు పెంచుతున్నామని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 1 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త విధానం అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. రాష్ట్రానికి కేటాయించిన 8 కోట్ల పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోంది.