ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అప్పుల పాలై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ వెంచర్ లో ఈ నెల 23న రాత్రి ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధి బత్తిని గణేష్(22) గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అతని మిత్రుడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ హాస్పిటల్ తరలించారు.
చికిత్స పొందుకు సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన గణేష్ స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతు రాంపల్లిలో మిత్రులతో కలిసి అద్దెగదిలో ఉంటున్నాడు. గత కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి తోటి మిత్రులు, ఇతరుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకురావటంతో జీవితంపై విరక్తి చెందిన గణేష్ పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నారు. మృతుని తల్లి బత్తిని సంధ్య ఫిర్యాడు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.