అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి
డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, జూన్ 22 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి అని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లోని బోడుప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వజ్రెష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా బిఎల్‌ఎ లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు, లోపాలు లేకుండా చూసుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బిఎల్‌ఎ లు ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బి-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






