05-08-2025 01:35:29 AM
లోక్ సభలో ఎంపీ కావ్య
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య సోమవారం లోక్‌సభ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దేశంలో ఐఐఎం లేని ఏకైక రాష్ర్టం తెలంగాణనే అని గుర్తు చేశారు. ఐఐఎం ఏర్పాటు కొరకు అవసరమైన భూమి, మౌలిక వసతులు కల్పించేందు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ఐఎస్బీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని, రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని ఎంపీ తెలిపారు. కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందిస్తూ ప్రస్తుతం హైదరాబాదులో ఐఐఎం స్థాపనకు ఎటువంటి ప్రతిపాదన కేంద్రం వద్ద పరిశీలనలో లేదని, దేశంలో ఇప్పటికే 21 ఐఐఎంలు ఉన్నాయని వివరించారు. కేంద్రం స్పందనపై కావ్య అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలోని యువతకు మంచి మేనేజ్‌మెంట్ విద్య అవసరముందన్నారు.