16-12-2024 01:27:24 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పదేళ్ల మీ పాలనపై విసుగు చెంది ప్రజలు ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూ ప్రజలను పక్కదారి పట్టించడం ఇకనైనా మానుకోవాలంటూ పీసీ సీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశగా తను ఈ లేఖ రాస్తున్నానంటూ ఆయన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. సెంటిమెంట్ పేరుతో రెండు దఫాలుగా అధికారం చేపట్టిన మీరు గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయా నికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమై పాలన సా గించడంతో కేసీఆర్ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. పెత్తందారు సర్కార్ తీరుతో విసిగిపోయిన ప్రజలు బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడినా కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల్లో, ఆ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదన్నారు.
ఇంటికో ఉద్యోగమని..
గంపెడాశలు పెట్టుకున్న యువతకు ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబంలోని సభ్యులకే రాజకీయ ఉపాధి కల్పించుకున్నా రని మహేష్ గౌడ్ అన్నారు. పదో తరగతి మొదలు గ్రూప్ పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమేనన్నారు.
ఏడాదిలోనే రాష్ర్టంలో దాదాపు 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పామని తెలిపారు. ఉద్యమంలో మరో నినాదమైన నీళ్లను కూడా కేసీఆర్ పాలనలో నీరుగార్చారన్నారు. అవినీతే లక్ష్యంగా కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి.. డిజైన్‌ను ఇంజినీర్లు చేపట్టాల్సి ఉండగా, ఆయనే కాళేశ్వరం డిజైన్ రూపకర్తను అంటూ గర్వంగా చెప్పుకున్న మీరు ప్రాజెక్టు నాణ్యతా లోపంలో కూడా బాధ్యతవహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు పనిచేయకపోయినా తెలంగాణ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో 66.76 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద అవినీతి మీది..
తెలంగాణ నిధులను దోచుకున్నారని ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టిన కేసీఆర్, ఉమ్మడి రాష్ర్ట చరిత్రలోనే లేనివిధంగా అవినీతికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. ప్రాజెక్టులు, ఫ్లుఓవర్లు ఇలా అన్ని రంగాల్లో అవినీతి చేశారని అన్నారు. ధరణి పేరుతో మీ పార్టీ నేతలు పేదల భూములు కొల్లగొట్టి దోచుకున్న దాంట్లో తెరవెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు.
2014 జూన్ 2న రాష్ర్టం ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఉండగా, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి రాష్ర్టం రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఉందనేది వాస్తవం కాదా.. మీరు చేసిన అప్పులతో ప్రస్తుతం ప్రతి నెల రూ.6500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందన్నారు. సంకల్ప బలంతో రూ.21 వేల కోట్లు మాఫీ చేయడంతో, రాష్ర్టంలో 25 లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయం పొందడాన్ని మేము గర్వంగా భావిస్తున్నామన్నారు.
పంటల బీమా మేమే చేశాం....
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా లేకపోవడంతో రైతాంగం నష్టపోగా కాంగ్రెస్ ప్రభుత్వం 42 లక్షలకుపైగా రైతులకు బీమా కవరేజీ కోసం రూ.1,433.33 కోట్ల ప్రీమియం చెల్లించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన 94 వేల మందికి పైగా రైతులకు రూ.95.38 కోట్ల పంట నష్టాన్ని చెల్లించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకుందన్నారు. సన్నాలు పండించిన వారికి రూ.500 బోనస్ చెల్లించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
తెలంగాణ తల్లిపైనా రాజకీయం...
అధికారంలో ఉన్న పదేళ్లు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని బీఆర్‌ఎస్ సర్కారు ఇప్పుడు తాము ఏర్పాటు చేస్తే విమర్శించడం ఎంత వరకు సమంజసమని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రాచరికానికి దర్పణంగా కిరీటంతో, బతుకమ్మతో విగ్రహం ఉంటే, తాము ఏర్పాటు చేసిన విగ్రహంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతూ సహజసిద్ధమైన మాతృమూర్తిలా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గీతం రచయిత అందెశ్రీపై మీరు కక్షగట్టి అవమానించి, రాష్ట్రానికి పదేళ్లు అధికారిక గీతం లేకుండా చేసిన తీరును మర్చేపోయారా అని ప్రశ్నించారు.
మహాలక్ష్మిని మేం తెస్తే... సారా కేసులో కవిత జైలుకెళ్లింది..
‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చి మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకున్నామని పీసీసీ చీఫ్ అనారు. అదే సమయంలో మీ కూతురు కవిత సారా స్కాంలో జైలుపాలు కావడాన్ని రాష్ర్టంలోని మహిళలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. మొదటి తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా పాలించిన చరిత్ర మీదని అన్నారు.
మూసీ గురించి బీఆర్‌ఎస్ వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని... మూసీ సుందరీకరణ చేస్తానని గతంలో చెప్పిన మాట గుర్తుందా.. అని ప్రశ్నించారు.హైదరాబాద్ డల్లాస్, పాతబస్తీ ఇస్తాంబుల్‌గా మారాయా అని ప్రశ్నించారు. పాతబస్తీలో మెట్రో రైలుపై కేసీఆర్ దాటవేత వైఖరి ప్రదిర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకుందన్నారు.
అసెంబ్లీకి వచ్చి సూచనలివ్వండి...
అధికారంలో ఉన్న పదేళ్లు పలు మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫాం హౌస్‌కే ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మహేష్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కాకుండా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ర్ట అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు.