ప్రజా భద్రతకు మరింత పటిష్ట చర్యలు
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రజా భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీస్ అధికారుల పనితీరును సమగ్రంగా సమీక్షించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో పాటు, నిషేధిత గంజాయి, గుడుంబా, మత్తు పదార్థాల వినియోగం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతం చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం, కేసుల పరిష్కారంలో ఆధునిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు..
రాత్రి వేళల్లో నేరాలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ పెట్రోలింగ్ను మరింత పటిష్టంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గ్రామస్థాయిలో నేర సమాచారం సేకరణను పెంచాలన్నారు.
ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు.. ప్రతి నేరంపై సమర్థవంతమైన ఎన్ఫోర్స్మెంట్.. ప్రతి పౌరుడికి పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పోలీసింగ్ అందించడమే మహబూబాబాద్‘ జిల్లా పోలీస్ శాఖ లక్ష్యం’ అని జిల్లా ఎస్పీ తెలిపారు. విశిష్టమైన సేవలు అందించిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.






