అడివిమల్లెల గురుకుల పాఠశాలను పరిశీలించిన సబ్ కలెక్టర్
కల్లూరు/పెనుబల్లి ఆగస్టు 12 (విజయక్రాంతి): అడివిమల్లెల గురుకుల పాఠశాల,వసతి గృహాన్ని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల, వసతి గృహంలోని పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలుకల నిర్మూలనకు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వసతి గృహం,ఇతర ప్రాంతాల్లోకి ఎలుకలు ప్రవేశించకుండా దెబ్బతిన్న మెష్లను వెంటనే మరమ్మతు చేయాలని,అవసరమైన చోట కొత్త మెష్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పాఠశాల,వసతి గృహ ప్రాంగణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని,చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు క్రమం తప్పకుండా పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు.ఎలుకల నిర్మూలన, మెష్ల మరమ్మతులు తదితర అవసరమైన పనులను వెంటనే పూర్తి చేసి,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.






