31 July, 2026 | 9:58 PM

పీసీసీ పదవి అడిగే స్వేచ్ఛ అందరికి ఉంటుంది

28-05-2024 01:31 AM

బీజేపీలో పదవి అడిగితే ఉన్నది పోతుంది 

బీఆర్‌ఎస్‌లో అడిగే పరిస్థితి లేదు 

మోదీ ఏం చేశారో చెప్పాలి 

 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): బీజేపీలో పదవి అడిగితే ఉన్న పదవి పోతుందని, బీఆర్‌ఎస్‌లో పదవి అడిగే పరిస్థితే  ఉండదని,  కాంగ్రెస్‌లో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పీసీసీ అధ్యక్ష  పదవి అడిగే స్వేచ్ఛ ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ అధక్షుడి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన పైవిధంగా స్పందించారు.

గాంధీభవన్‌లో పార్టీ నేతలు భవానీరెడ్డి, చరణ్‌కౌసిక్ యాదవ్, మెట్టు సాయికుమార్, గజ్జి భాస్కర్‌తో కలిసి జగ్గారెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. దశాబ్దాల పాటు పాలన అందించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం వారి అవివేకమని విమర్శించారు.  తినడానికి తిండి, విద్యుత్ వెలుగులు, సాగునీటి ప్రాజెక్టులు లేని సమయంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ పాలనలో 40 కోట్ల జనాభా ఆకలి తీర్చిందని, ఎంతో దూర దృష్టితో సాగు నీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే శ్రీశ్రైలం, నాగార్జునసాగర్ బహుళార్థక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈ దేశానికి అందించిందని పేర్కొన్నారు.

ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసి ధాన్యం నిల్వ చేశారని, పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించారని తెలిపారు. కాంగ్రెస్ హయాం లోనే ఎస్సారెస్పీ, మంజీర, సింగూరు లాంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్ మంజీర, సింగూరు నీళ్లు తాగిన వాళ్లేనని గుర్తు చేశారు. మరి మోదీ పదేళ్ల పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో? ఎన్ని కంపెనీలు పెట్టారో? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో? చెప్పాలని  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కును ఇప్పుడు అమ్మకానికి పెట్టింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో అంతా మేమే చేశామని అంటున్న బీఆర్‌ఎస్.. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయకుం డానే కేసీఆర్ చేశారా..? అని నిలదీశారు.