స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27, (విజయక్రాంతి): జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి డిజిటల్ జనగణన నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, సోమవారం రోజున కలెక్టర్ అంకిత్ తన నివాసంలో స్వయంగా స్వీయ గణన విధానంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన సమాచారం నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసిన వారు నమోదు సమయంలో పొందిన యూనిక్ ఐడీ నంబర్ను తెలియజేయాలన్నారు.
స్వీయ గణన చేసిన ప్రతి ఒక్కరు తమకు వచ్చిన ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, తద్వారా ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండవచ్చని తెలిపారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైందని పేర్కొంటూ, జిల్లా ప్రజలు బాధ్యతతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ కోరారు. జనాభా లెక్కల స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని అందించడంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.






