డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
- బండ రావిరాల సర్పంచ్ కంది కంటి విజయ్ కుమార్
- రైతులు తీవ్రంగా నష్టపోతారు పబ్బతి బాలకిషన్ గౌడ్
- డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి : బింగి దేవదాస్ గౌడ్
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 27: డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బండారావిరాల సర్పంచ్ కందికంటి విజయకుమార్ అన్నారు. మండల పరిధి బండ రావిరాల సర్వే నెంబర్ 268లో 494 ఎకరాల విస్తీర్ణంలో ఏకో టౌన్ పేరుతో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చూస్తున్నట్లు తెలిసింది.
డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలంటూ బాధిత గ్రామాల సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం చిన్న రావిరాల గ్రామపంచాయతీ పరిధిలోని గువ్వలేటి చౌరస్తాలో గల ఎస్. ఆర్ ఎస్. గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. సమావేశానికి బండ రావిరాల సర్పంచ్ కంది కంటి విజయ్ కుమార్, చిన్న రావిరాల సర్పంచ్ పబ్బతి బాలకిషన్ గౌడ్, పిల్లయి పల్లి సర్పంచ్ పెరుమాళ్ళ మహాలక్ష్మి దానయ్య, దేశ్ ముఖి సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, బలిజగూడ సర్పంచ్ ఉప్పు మాధవి నవీన్ కుమార్, జగత్ పల్లి సర్పంచ్ ఇట్ట మోని మహేష్ యాదవ్, ఆయా గ్రామాల బాధిత రైతులు, ప్రజలతో సమావేశాన్ని హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండ రావిరాల గ్రామపంచాయతీ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కలుషితమవు తాయని అన్నారు. చెత్తలోని వ్యర్ధాలు భూమిలోకి ఇంకి నీరు విషతుల్యం అవుతాయన్నారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకోవడానికి పార్టీల కతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదని కొన్ని గ్రామాల ప్రజల ఆరోగ్యాలపై, వారు పీల్చే గాలి, త్రాగే నీటిపై తీవ్ర ప్రభావం చూపించి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. బండరావిరాల, చిన్న రావిరాల పిల్లాయిపల్లి, దేశ్ ముఖ్, పెద్దగూడెం, జగత్ పల్లి సత్తుపల్లి, కవాడి పల్లి, బలిజగూడ, బాచారం, తారామతి పేట్, గౌరెల్లి గ్రామాల ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పబ్బతి బాలకిషన్ గౌడ్ మాట్లాడుతూ.. జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సిన డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే డంపింగ్ యార్డ్ ఏర్పాటును బాధిత కుటుంబాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాజా మాజీ జెడ్ పీ టీ సీ బింగి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత 20 ఏండ్ల నుంచి మైనింగ్ జోన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు అంటూ చేదువార్తతో ప్రజలు కంటిమీద కునుకు లేదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






