1 July, 2026 | 1:11 AM

ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలి

01-07-2026 12:00 AM

బోయపల్లి రాఘవేందర్ రెడ్డి

బడంగ్ పేట్, జూన్ 30 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లో తప్పని సరిగా ప్రతి ఒక్కరు పాల్గొని, అర్హులైన వారు తమ ఓటు వచ్చేటట్టుగా చూసుకోవాలని ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలో  ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన తన కార్యాలయంలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో  కలిసి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన, ఎస్‌ఐఆర్  కార్యక్రమం అమలు విధానం, కొత్త ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలపై సమగ్రంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఓటరికీ సేవలు అందించేలా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై బీఎల్‌ఓలకు రాఘవేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు.

అనంతరం బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి రాఘవేందర్ రెడ్డి పలు కాలనీలలో ఇంటింటికీ తిరిగి ఎస్‌ఐఆర్ పై అవగాహన కల్పించారు. ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తూ, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, బీఎల్‌ఓ సుస్మా, తరుణ్, ధన్సింగ్ నాయక్, అంజన్ కుమార్, రవీందర్ రావుతో పాటు పలువురు బీఎల్‌ఏలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.