13-10-2025 05:42:43 PM
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగహన అవసరమని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్(కార్డియో పల్మోనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీపీఆర్ పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రజా జీవితంలో అకస్మాత్తుగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్‌తో ప్రథమ చికిత్స అందజేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడుతారన్నారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా చేతులతో సీపీఆర్ విధానాన్ని చేసి చూపించారు. దీని ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ రాజు, డాక్టర్ మధు ప్రయోగపూర్వకంగా సీపీఆర్ ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. అవగాహన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో వైద్యాధికారులు సీపీఆర్ ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా వైద్య అధికారి డాక్టర్ సిద్ధప్ప, డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.