calender_icon.png 13 October, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్ధలతో సప్తాహ వేడుకలు మొదలైన పార్డి గ్రామం

13-10-2025 08:16:27 PM

ఏడు రోజులపాటు ఆంజనేయ భజనోత్సవాలు

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం సప్తాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల నేపథ్యంలో ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శ్రీ రాజరాజేశ్వరాలయాలను ఆకర్షణీయంగా అలంకరించారు. సోమవారం ఉదయం స్వామివారికి, శివలింగానికి అభిషేక, పుష్పార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి వారి చిత్రపటం వద్ద శ్రీఫలాన్ని ఉంచి దైవనామస్మరణతో భజనలు చేస్తూ సప్తాహ వేడుకలను ప్రారంభించారు.

స్థానిక ఆలయాల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏడు రోజులపాటు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కీర్తనకారులు కీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హరిపాట్, భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. 19వ తేదీ రాత్రి గ్రామాలనుండి భజన దిండిలతో జాగారం జరగనుంది. తెల్లవారుజామున కాకడ హారతి, ఉదయం శోభాయాత్ర అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం, తరువాత అన్నదాన కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. సప్తాహ వేడుకల్లో గ్రామస్తులు, భజనకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.