30-06-2025 08:25:47 PM
చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు..
బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి..
అడిషనల్ ఎస్పీ జి.రమేష్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ జి.రమేష్(Additional SP G. Ramesh) అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్(District SP Sharath Chandra Pawar IPS) సూచనలతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్(Operation Muskaan) కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, అదేవిధంగా జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
జూలై 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ పరిధిలో మూడు టీమ్ లుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపనిలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అన్నారు.
ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్న 1098 గాని, డయల్ 100కి గాని వారికి సమాచారం ఇవ్వాలి అని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, అస్సిస్టెంట్ లేబర్ ఆపిసర్ కృష్ణవేణి, ఏ.హెచ్.టి.యు ఎస్.ఐ రంగా రెడ్డి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.