13 April, 2026 | 1:53 AM

ఓటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం

13-05-2024 12:45 AM

ఎన్నికల సామగ్రి తరలింపు పూర్తి 

రిటర్నింగ్ అధికారి రాజర్షిషా వెల్లడి

ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 12 (విజయక్రాంతి): లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న పోలింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఆదివారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) నియోజకవర్గాల్లో మొత్తం 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2,637 మంది పీవోలను, 2,637 మంది ఏపీవోలను, 5,274 మంది ఓపీఓలను ఎన్నికల నిర్వహణకు నియమించారు. ఎన్నికల సిబ్బందికి ఆదివారం ఉదయం ౭ గంటల నుంచే పోలింగ్ సామగ్రిని అందజేశారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం దగ్గర నుంచి పర్యవేక్షించారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ సురేష్‌కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారి, దాసరి వేణులు పరిశీలించారు.