10-11-2025 03:15:04 PM
హైదరాబాద్: హోరేతిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం నిన్నటితో ముగిసింది. కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. యూసుఫ్ గూడ డీఆర్సీ సెంటర్ లో స్ట్రాంగ్ రూమ్‌ల నుండి పోలింగ్ సిబ్బందిని మోహరించడం, ఈవీఎంలు, వీవీప్యాడ్ యంత్రాలను తరలించడం వంటి ఏర్పాట్లు సోమవారం ముమ్మరంగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పిఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఎపిఓలు), ఇతర పోలింగ్ అధికారులు (ఒపిఓలు) సహా మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ ఈవీఎంలకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేశారు. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని దృష్టిలో ఉంచుకుని మొత్తం 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోలింగ్ యూనిట్లు, 595 వీవీపీఏటీలను సిద్ధంగా ఉంచారు. 407 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ పనిచేస్తుంది. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని, ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్లే గంటసేపు సమయం పెంచిన్నట్లు తెలిపారు.