10-11-2025 08:35:45 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. పలువురికి తీవ్రగాయలు అవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్ఎన్‌జిపి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు పలు నగరాల్లో హైఅలర్ట్ ను ప్రకటించారు. దీంతో ఢిల్లీతో సహ ముంబై, హైదరాబాద్ నగరాల్లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
రద్దీగా ఉండే ఎర్రకోట మెట్రో స్టేషన్ ప్రాంతం జనంతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, పేలుడుకి సంబంధించిన వీడియోలు పేలుడు తీవ్రతను చూపించాయి. వాహనంపై ఒక మృతదేహం పడి ఉండటం కనిపించగా.. మరో వీడియోలో రోడ్డుపై ఒక మృతదేహం పడి ఉండటం కనిపించింది. పేలుడు జరిగిన ప్రదేశం సమీపంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడుతో ఘటన స్థలంలో భయంకరమైన దృశ్యాలు నెలకొంది.