26 April, 2026 | 12:59 AM

అవినీతిపరుడు సజ్జనార్

11-05-2024 02:25 AM

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

నిజామాబాద్, మే10 (విజయక్రాంతి): టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అవినీతిపరుడు అని, పోలీస్‌అధికారిగా ఆయన వృత్తి జీవితంలో రూ.వేలాది కోట్లు దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సజ్జనార్‌పై సుప్రీం కోర్టుతో పాటు పలు కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటన్నింటినీ వెలికి తీస్తానన్నారు. కొత్త బస్సులు, విడి భాగాలు, టైర్ల కొనుగోళ్లు, స్క్రాప్ అమ్మకాలలో పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సజ్జనార్ ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆయనపై విచారణ జరిపి ఎండీ పదవి నుంచి తొలగించాలని, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారన్నారు. ఆర్మూర్‌లోని తన షాపింగ్‌మాల్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించినప్పటికీ, మాల్ వద్దకు ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు. షాపుల నుంచి బకాయిలు వసూలు చేసి, జీఎస్టీని ఎందుకు కేంద్రానికి చెల్లించడం లేదో సజ్జనార్ సమాధానం చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన పని చేస్తున్నారని ఆరోపించారు.