26 April, 2026 | 2:22 AM

మళ్లీ శీష్‌మహల్ వివాదం

26-04-2026 12:59 AM

కేజ్రీవాల్ కొత్త బంగ్లా ఫొటోలంటూ పోస్ట్

శీష్‌మహల్ పేరిట బీజేపీ నేత పర్వేష్‌వర్మ విడుదల

ఫొటోలు అవాస్తవం: ఆప్ నాయకురాలు అతిశీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఢిల్లీ రాజకీయాల్లో శీష్‌మహల్ వివాదం మళ్లీ మొదలైంది. 95 లోధి ఎస్టేట్‌లోని ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్  కొత్త బంగ్లాకు సంబంధించినవని పేర్కొంటూ శనివారం బీజేపీ నేత పర్వేష్‌వర్మ సోషల్‌మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఆ ఫొటోలకు ‘శీష్ మహ ల్ 2’ అని కూడా హ్యాష్ ట్యాగ్ చేశారు. ఢిల్లీ ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్న సమయంలో కేజ్రీవాల్ అంతఃపురం లాంటి నివాసం కట్టుకున్నారని ఆరోపించారు.

మద్యం కుంభకోణం నిధులతోనే ఆ పనులు జరిగాయని ఆరోపించించారు. తనకు తాను సాదాసీదా మనిషి నని చెప్పుకొంటూ కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజలు మెడిసిన్, ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడుతున్నా, నిర్మాణ పనులు మాత్రం ఆగలేదని దుయ్యబట్టారు. అంతేకాదు.. కేజ్రీవాల్‌ను ‘ధురందర్’ చిత్రంలోని విలన్ రెహమాన్ డెయికాట్ పాత్రతో పోల్చారు. ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కేజ్రీవాల్ తన దృష్టిని పంజాబ్ వైపు మళ్లించారని అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం చుట్టూ ఉన్న అనేక ప్రభుత్వ వసతి గహాలను కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సహా ఆప్ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నేత పర్వేష్ వర్మ ఆ ఫొటోలను పింట్రెస్ట్ వెబ్‌సైట్ నుంచి దొంగిలించినవని ఆప్ నేతలు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, ఆప్ నాయకురాలు అతిశీ మాట్లాడుతూ.. ఆ ఫొటోలు నిజమైనవి కావని, గూగుల్, పింట్రెస్ట్ వంటి సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలతో బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ నేతలకు కనీస ఐటీ పరిజ్ఞానం లేదంటూ ఎద్దేవా చేశారు. పింట్రెస్ట్ నుంచి ఫొటోలు దొంగిలించే బదులు ఏఐ వాడి ఉంటే దొరికిపోయే వారు కాదని చమత్కరించారు. తమ పార్టీ అధినేతపై అబద్ధపు ప్రచారం చేస్తున్న పర్వేష్ వర్మపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆ ఫోటోలకు కేజ్రీవాల్ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరి ఇల్లు విలాసవంతంగా ఉందో ప్రజలే తేలుస్తారని చెప్పారు.

కేజ్రీవాల్ వంద కోట్ల ఇల్లు కట్టుకున్నారు: స్వాతి మాలివాల్

నాడు చిరిగిన ప్యాంట్లు వేసుకుని అనామకంగా రోడ్లపై తిరిగిన వారు, ఇప్పుడు వందల కోట్లు వెచ్చించి ఇల్లు కట్టుకన్నారని ఎంపీ స్వాతి మాలివాల్ పరోక్షంగా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి కోసం విదేశీ కార్పెట్లు, ఖరీదైన ఫ్రిడ్జ్‌లు కొన్నారని ఆరోపించారు. నాడు రెండు రూపాయల పెన్ను వాడి పాత కారులో తిరిగేవారని గుర్తుచేసుకున్నారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన మరుసటి రోజే ఆమె కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు.

కేజ్రీవాల్ గుండాయిజానికి పాల్పడుతున్నారని, దీనిలో భాగంగా గతేడాది తనపై కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేయించారని మండిపడ్డారు. ఆ దాడిపై ఫిర్యాదు చేస్తే ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. తనపై దాడి చేసిన వ్యక్తికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి పంజాబ్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ సంస్కృతిని వ్యతిరేకించిన కేజ్రీవాల్, ఇప్పుడు యాభై కార్ల కాన్వాయ్‌తో తిరుగుతున్నారని విమర్శించారు.

సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేజ్రీవాల్ కంటే పెద్ద ద్రోహి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. తాను 2006 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసినప్పటికీ, చివరకు తనకు అవమానమే ఎదురైందని వాపోయారు. రెండేళ్లుగా పార్లమెంటులో పార్టీ తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి అని పేర్కొన్నారు.