16 July, 2026 | 1:50 AM

గ్రూప్1లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి

07-06-2024 02:27 AM

ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): గ్రూప్-1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అన్ని ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రూప్-౧ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న జారీచేసిన నోటిఫికేషన్ ఉందని మెదక్ జిల్లాకు చెందిన ఎం అర్జున్, కే అరుణ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

వీరి పిటిషన్లను గురువారం జస్టిస్ పుల్లా కార్తీక్ విచారించారు. అన్ని ఉద్యోగ నియామకాల్లోనూ హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రూప్ 1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఉందని న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.