calender_icon.png 28 January, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

28-01-2026 12:46:49 AM

  1. కొత్తగూడెం కార్పొరేషన్కు  ఎన్నికలు జరిగేనా? 

రాజకీయ పార్టీలోను, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మంగళవారం హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ప్రొసీడింగ్ జారీ చేస్తుందో నాన్న అంశంపై రాజకీయ పార్టీలతోపాటు, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయా? న్యాచుక్కుల్లో మళ్ళీ కార్పోరేషన్ చిక్కుకుంటుందా? అన్నది పెద్ద మీమాంసగా మారింది. పాల్వంచ మున్సిపాలిటీకి గత 27 సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదు.

ఈ నేపథ్యంలో గత ఏడాది మే నెలలో ప్రభుత్వం  కొత్తగూడెం కార్పొరేషన్ గా ప్రకటిస్తూ పాల్వంచ, కొత్తగూడం పట్టణాలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. కార్పొరేషన్ కావడంతో పాల్వంచ వాసులకు వేలుకు ఇంకు అంటించుకొనే భాగ్యం కలిగిందని ఆశించారు. ఇంతలోనే ఆశలకు న్యాయపరమైన అడ్డంకులు తలెత్తాయి.

పాల్వంచ ప్రాంతం ఏజెన్సీ నా, నాన్ ఏజెన్సీ నా అనే అంశంపై ఇప్పటికే కోర్టులో కేస్ పెండింగ్ లో ఉన్న విషయం విధితమే. ఆ అంశంపై స్పష్టత రాకముందే ఆ ఈ ప్రాంతాన్ని కార్పొరేషన్ గా ఎలా కలుపుతారు అంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు కీలక ప్రొసీడింగ్స్ ఇవ్వనుంది. పాల్వంచ తో పాటు సుజాతనగర్ మండలంలోని గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు తలెత్తాయి. 103 జీవో ప్రకారం పిసా చట్టం కింద ఏజెన్సీ ప్రాంతాల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

పిసా చట్టానికి విరుద్ధంగా గ్రామాలను కార్పొరేషన్ లో కలపడం చట్ట పరమా అనే ప్రశ్న ఇప్పుడు న్యాయపరిశీలనలో ఉంది. ఈ పరిణామాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా, పాల్వంచ మున్సిపాలిటీ గ్రహణం, కొత్తగూడెం మున్సిపాలిటీకి పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళికంగా కార్పొరేషన్ ఏర్పాటు అస్తవస్తంగా ఉందనే ఆరోపణలు లేకపోలేదు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి కేఎస్‌ఎమ్ పెట్రోల్ బంక్ వరకు మాత్రమే ఉంటుంది. పెట్రోల్ బంక్ దాటిన తర్వాత లక్ష్మీదేవి పల్లె మండలం ప్రారంభమవుతుంది.

ఆ మండల పరిధి కొత్తగూడెం మొర్రేడు బ్రిడ్జి అవతలి అంచు వరకు ఉంటుంది. ఆ తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి ప్రారంభమవుతుంది. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు మాత్రమే మున్సిపాలిటీగా ఉండి, ఆ తరువాత చుంచుపల్లి మండలం ప్రారంభమవుతుంది. అనంతరం సుజాతనగర్ మండలం ప్రారంభమవుతుంది. ఇలా కొంత మున్సిపాలిటీ, మరికొంత మండల పరిధి ఉండటం కార్పొరేషన్ భౌగోళిక పరిస్థితికి ఆటంకం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం మాత్రం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను 60 డివిజన్లుగా విభజించి ప్రకటించింది.

పాల్వంచ మున్సిపాలిటీని 27 డివిజన్లుగా, కొత్తగూడెం మున్సిపాలిటీని 29 డివిజన్లుగా, సుజాతనగర్ ప్రాంతాన్ని 4 డివిజన్లుగా విభజించారు. మూడు దశాబ్దాల పాటు పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం, కార్పొరేషన్ గా ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఆశావాహులు పెద్ద సంఖ్యలో పోటీకి ముందుకు వస్తున్నారు. రాజకీయ పార్టీలు టిక్కెట్లను ఖరారు చేయకపోయినా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జంట పట్టణాల్లో ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఫ్లెక్సీలు, కటౌట్లు పెద్ద సంఖ్యలో వెలుపడ్డాయి. 

న్యాయస్థానం తీర్పే తరువాయి..

ఎన్నికలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, ఎన్నికలను బ్రేక్ వేస్తుందా అన్నది ఎప్పుడు రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించే అంశంగా మారింది. హైకోర్టు ప్రొసీడింగ్స్ తోని పాల్వంచ కొత్తగూడెం రాజకీయ భవిష్యత్తు ముడీపడి ఉంది.