28-01-2026 01:47:08 AM
మేడారం, జనవరి 27 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజనుల ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు నేడు కన్నేపల్లి నుంచి అడవి బిడ్డల ఆరాధ్య దైవమైన సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణాన్ని చేరుకోవడం ద్వారా మహా జాతర ఆధ్యాత్మిక సంరంభం ఆరంభం కానుంది. జాతర తొలి అంకంలో భాగంగా బుధవారం సారలమ్మ తల్లితో పాటు వనదేవతలుగా విరాజిల్లుతున్న పగిడిద్ద రాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపై కొలువుదీరను న్నారు.
ప్రకృతి, సంప్రదాయం, విశ్వాసం మిళితమై మేడారం అరణ్యం వనదేవతల ప్రతిష్ఠతో కొత్త వెలుగును ప్రకాశించనుం ది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర మహోత్సవానికి ఇప్పటికే లక్షలాదిమంది భక్తుల రాక మొదలయ్యింది. మేడారం సమీపంలోని కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడి నుంచి సంప్రదాయ పద్ధతిలో పూజారులు తల్లిని ప్రత్యేక పూజ ల అనంతరం మది నిండిన భక్తి భావంతో మేడారం తోడుకొని వచ్చి గద్దెలపై అధిష్ఠింపజేస్తారు. సారలమ్మ తల్లి రాకతో జాతర ఆరంభానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.
మేడారం మహా జాతర ఈసారి సరికొత్త వెలుగు జిలుగుల్లో విరాజిల్లుతోంది. సకలహంగులతో అత్యధిక విద్యుత్ దీప కాంతులతో మేడారం మహానగరాన్ని తలపిస్తోంది. మేడారం నలువైపులా 10 కిలోమీటర్ల మేర రహదారులన్నీ ధగధగ మెరిసిపోతున్నాయి. మేడారం పరిసరాలన్నీ లక్షలాదిమంది భక్తులతో నిండిపోయాయి. వేల కొలది వాహనాలు మేడారం బాట పట్టాయి. జాతరలో ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు విడిది చేశారు. సారలమ్మ రాకతో జాతర ప్రారంభం కానుండడంతో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి శుక్రవారం వనదేవతలకు మొక్కులు చెల్లించి తిరుగు ముఖం పడతారు.
అన్నిదారులు మేడారం వైపే..
మేడారం మహా జాతరకు భక్తుల రాక మంగళవారం మొదలయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో మేడారం బాట పట్టారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారం తరలివస్తున్నారు. దీనితో దారులన్నీ మేడారానికే దారితీస్తున్నాయి.
మేడారంలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, రెడ్డిగూడెం, ఊరట్టమ్, కన్నేపల్లి, నార్లాపూర్, కొత్తూరు, ఎలుబాక, కొంగలమడుగు, చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో భక్తులు గుడారాలు వేసుకుని విడిది చేస్తున్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెకు చేరుకునే సమయానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కీలకమైన పాత్ర సమ్మక్క సారలమ్మ పూజారులదే..
వన దేవతలను భక్త జనానికి దర్శన భాగ్యం కల్పించడంలో పూజారులు నిష్ట నియమాలతో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ మేడారం మహా జాతర విజయవంతానికి సమ్మక్క, సారలమ్మ ప్రధాన పూజారులు కొక్కర కిష్టయ్య, కాక సారయ్యతో పాటు ఇతర పూజారులు కీలక పాత్ర పోషిస్తారు. 28న బుధవారం కన్నేపల్లి సార్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జంపన్న వాగు ద్వారా మేడారం చేరుకుంటారు.
ప్రధాన పూజారి కాక సారయ్యకు సహాయకులుగా కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, గొంది లక్ష్మయ్య, రంజిత్ హనుమాన్ జండా రక్షకుడిగా, ధూ ప దీపం, బిలకం తో సారలమ్మ తల్లిని మేడారం గద్దె పైకి తీసుకువచ్చి అధిష్టింప చేస్తారు. 29న సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య గద్దెల ప్రాంగణానికి తోడుకొని వచ్చి అధిష్టింపజేస్తారు. కిష్టయ్యకు సహాయకులుగా సిద్ధబోయిన మునిందర్ బొక్కయ్య, స్వామి, జనార్ధన్, సత్యం నాగేశ్వరరావు సమ్మక్క తల్లిని కొమ్ము, జలకం, ధూప దీపంతో తల్లి ని గద్దెకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు.
వంశపారంపర్య పూజారులు..
మేడారం జాతరలో కీలక పాత్ర పోషించేది, వంశపారంపర్యంగా వన దేవతలను జాతర సందర్భంగా పూజలు నిర్వహించి వనం నుండి జనంలోకి తీసుకువస్తూ ఆదివాసి గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా పూజారులుగా విలసిల్లుతున్నారు. నియమ నిష్టలతో మన దేవతలను ఆవాహనం చేసుకొని భక్తజన కోటికి దర్శన భాగ్యం కల్పించేం దుకు సమ్మక్క సారలమ్మ పూజారుల విశిష్టత మహా గొప్పదని చెబుతారు.
రేపు మహాదేవత సమ్మక్క రాక..
మేడారం మహా జాతరలో అద్వితీయ ఘట్టమైన మహాదేవత సమ్మక్క తల్లి గురువారం చిలకల గుట్ట నుండి మేడారం గద్దెల ప్రాంగణాన్ని అధిష్టించనున్నారు. సమ్మక్క పూజారులు చిలకలగుట్ట పైకి వెళ్లి ప్రత్యేక పూజలుచేసి కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు. వనదేవత రాకకు సంకేతంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతిస్తారు. అనంతరం మేడారం చిలకలగుట్ట నుండి ప్రభుత్వ అధికార లాంచనాలతో స్వాగతం గద్దెకు తోడుకొని వస్తారు. అడుగడుగునా అమ్మకు జననీరాజనం పలుకుతారు.