calender_icon.png 28 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

28-01-2026 01:23:19 AM

చారిత్రాత్మక ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’

  1. ఒప్పందంతో భారత్‌కు బహుళ ప్రయోజనాలు 
  2. ఐరోపాకు ఎగుమతయ్యే వస్తువులపై ౯౯.౫% సుంకాల రద్దు 
  3. భారీగా తగ్గనున్న దిగుమతి సుంకాలు 
  4. లగ్జరీ కార్ల దిగుమతి సుంకం ౧౫౦% నుంచి ౧౦%కి తగ్గింపు 
  5. ఆటోమొబైల్, వైద్య పరికరాలు, వాహన విడిభాగాల దిగుమతి సుంకాలూ తగ్గుదల 
  6. ఐరోపా, భారతీయులకు మెరుగైన అవకాశాలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 27: దేశ రాజధా ని ఢిల్లీ వేదికగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం భారతదేశం-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఐ) కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈ శిఖరాగ్ర భేటీలో పాల్గొని ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ పేరున జరిగిన ఈ ఒప్పందంతో భారత్‌కు బహుళ ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆటోమొబైల్, డెయిరీ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, వాహనాలు, వైద్య పరికరాల దిగుమతులకు సుంకాల భారం ఎంతో తగ్గుంతుంది. మొత్తంగా ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతాన్నివ్వనున్నది. ప్రపంచ జీడీపీలో ప్రస్తుతం ఇండియా, ఈయూ ఉమ్మడి వాటా 25శాతం. ప్రపంచవాణిజ్యంలో ఇది మూడోవంతుకు సమానం. తాజా ఒప్పందంతో ఆ భాగస్వామ్యం మరింత పెరగనుంది.

ఒప్పందం ద్వారా భారత్ నుంచి ఐరోపా మార్కెట్‌కు ఎగుమతయ్యే వస్తువులపై 99.5 శాతం సుంకాలు రద్దవుతాయి. తద్వారా భారత టెక్స్‌టైల్స్, లెదర్, రసాయనాలు, ఆభరణాల రంగాలకు సరికొత్త ఉత్సాహాన్నివ్వనుంది. అలాగే ఐరోపా దేశాల నుంచి భారత్‌కు దిగుమతయ్యే వస్తువులపై భారీగా సుంకాలు తగ్గుతాయి. ఐరోపా నుంచి దిగుమతయ్యే కార్లపై దిగుమతి సుంకం 110 శాతం నుంచి దశలవారీగా 10శాతానికి, వైన్ బాటిళ్లపై సుంకం 150శాతం నుంచి 50శాతానికి, విస్కీపై 150శాతం నుంచి 25శాతానికి, డెయిరీ ఉత్పత్తులపై 30శాతం నుంచి 15శాతానికి సుంకాలు తగ్గనున్నాయి.

ఒప్పందంతో ఈయూ నిర్వహించే సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత సంస్థలకు అవకాశాలు రానున్నాయి. భారత్-- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై 2007 నుంచి ఇరువైపులా చర్చలు సాగుతున్నాయి. 18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది.

లగ్జరీ కార్ల ధరలు తగ్గుదల

ఒప్పందం ద్వారా మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, పోర్స్చే, లంబోర్గిని, ఫెరారీ, బెంట్లీ, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, వోల్వో, వోక్స్ వ్యాగన్, స్కోడా వంటి లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కార్ల దిగుమతిపై ప్రస్తుతం అమలులో ఉన్న 110శా తం ఉన్న దిగుమతి సుంకం.. ౧౦ శాతానికి తగ్గనుంది. అలాగే 5- 10 ఏళ్ల కాల పరిమితితో కార్ల విడిభాగాలపై దిగుమతి సుంకాలు రద్దవుతాయి.

తొలి దశలో 40 శాతం సుంకాన్ని తగ్గించడం వల్ల భారత వినియోగదారులకు సుంకం భారం సుమారు 70-90 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చితే ధరలతో పోలిస్తే కార్ల ధరలు 40 నుంచి 50 శాతం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు వర్తిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మొదటి ఐదేళ్ల వరకు ఒప్పందం నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థల సమన్వయానికి నిదర్శనం: మోదీ 

‘భారత్- -ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. యావత్ ప్రపంచం ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అని కొనియాడుతున్నది’ అని ప్రధాని మోదీ హ ర్షం వ్యక్తం చేశారు. గోవాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఎనర్జీ వీక్- - 2026’  సదస్సును ఆయన వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు.

ఒప్పందంతో ద్వారా భారత్, ఐరోపా ప్రజలకు అద్భుతమైన అవకాశాలు వస్తాయని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే రెం డు పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య సమన్వయానికి ఈ ఒప్పందం నిదర్శనమని అభివర్ణించారు. ఇది కేవలం వాణిజ్యపరమైన లాభాల కోసమే కాకుండా, ఇరువర్గాల మధ్య ప్రజాస్వామ్య విలువలను పెంపొందేందుకూ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సరికొత్త అధ్యాయానికి నాంది

భారత్ - ఈయూ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ (అన్ని ఒప్పందాలకూ తల్లి వంటిది). ఇరువర్గాల మధ్య సరికొత్త అధ్యాయానికి నాంది. ఒకే ఒక్క ఒప్పందం భారత్, ఈయూ దశ దిశలను మార్చనుంది. వాణిజ్యపరంగా రెండు వైపులా పరస్పర సహకారాలు అందించుకుంటూ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇరుపక్షాలు విడివిడిగా సాధించలేని ఆర్థిక వృద్ధి ఈ ఒప్పందం సాకారం చేస్తుంది.

 ఉర్సులా వాన్ డెర్ లేయన్,

ఈయూ కమిషన్ అధ్యక్షురాలు

నేను గోవా పౌరుడిని.. 

అంటోనియో కోస్టా భావోద్వేగం

భారత్ - ఈయూ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకున్నది. భేటీలో ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో లూయిస్ శాంటోస్ కోస్టా ప్రసంగిస్తూనే ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు. భారత్‌తో తనకున్న జ్ఞాపకాలను ఈ వేదిక ద్వారా గుర్తుచేసుకున్నారు. ‘నేను కేవలం ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడినే కాదు. నేను విదేశాల్లో ఉంటున్న భారతీయమూలాలున్న వ్యక్తిని’ అంటూ ప్రకటించారు. దీంతో సభ అంతా ఆశ్చర్యమపోయింది.

తర్వాత కోస్టా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘గోవాతో మా కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాన్న ఓర్లాండో కోస్టా గోవాలోనే పుట్టి పెరిగారు. ఆయన గొప్ప కవి. నాన్న తరఫు వారంతా గోవాకు చెందినవారే. గోవా విముక్తి తర్వాత నా 18 ఏళ్ల వయసులో పోర్చుగల్‌కు వలస వెళ్లాం. గోవావాసులు నన్ను ‘బాబుష్’(పిల్లాడా) అని ముద్దుగా పిలిచేవారు. 2017లో మా కుటుంబం గోవా వచ్చింది. ఇక్కడి సన్నిహితులతో ఆనందంగా గడిపాం’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 

అగ్రరాజ్యానికి మింగుడుపడని ఒప్పందం

భారత్- యూరోపియన్ యూనియన్ మ ధ్య కుదిరిన ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ చారిత్రాత్మ క వాణిజ్య ఒప్పందం అగ్రరాజ్యానికి షాక్‌నిచ్చింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇరు రెండు పక్షాలు చేతులు కలపడం ఆయనకు కంటగింపుగా మారే అవకాశం ఉంది. భారత్‌తోపాటు యూరోపియన్ దేశాలపై ఇప్పటికే ట్రంప్ అనేకసార్లు నోరుపారేసుకుని ఉన్నారు. తనకు నచ్చని, తన మాట వినని దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు విధిస్తూ వస్తున్నారు.

భారత ప్రధాని మోదీ తనకు కాల్ చేయలేదన్న అక్కసును ఇప్పటికే ట్రంప్ అనేకసార్లు వెళ్లగక్కారు. ఇక తాజా పరిణామంతో ఆయన ఎలా స్పందిస్తా రో చూడాలని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. వాస్తవానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే అక్కసుతో భారత్‌పై అమెరికా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఐ రోపా దేశాలు మాత్రం.. ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ బెదిరిం పులే భారత్ ఈయూ మధ్య ఒప్పందానికి దారితీశాయని చెప్పవచ్చు. అమెరికా విధిస్తున్న సుంకాల ముప్పు నుంచి తప్పించుకునేందుకే ఐరోపా దేశాలు భారత్ బాటపట్టాయి.

ఈయూవి ఆదర్శాలే.. ఆచరణ శూన్యం

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మేం భారత్‌పై 25 శాతం అదనపు సుంకం విధించాం. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. అది మా విజయమే. మా ఉద్దేశం సుస్పష్టం. భారత్ వంటి పెద్ద దేశం నుంచి రష్యాకు అందే నిధులను అడ్డుకోవడం మా లక్ష్యం. రష్యా నుంచి ముడిచమురు భారత్‌కు వెళ్తున్నది. అక్కడ శుద్ధి అయిన చమురును, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు తిరిగి కొంటున్నాయి.

మాకు మిత్రదేశాలని చెప్పుకునే ఐరోపా దేశాలు ఈ విషయంలో ఆదర్శాలు చెప్తుంటాయి కానీ, ఆచరణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ దేశంపై సుంకాలు విధించలేదు. ఇది కేవలం మూర్ఖత్వమే. అయినా మేం వెనక్కి తగ్గం. ట్రంప్ నాయకత్వంలో మేం రష్యా యుద్ధానికి ఎలాగోలా ముగింపు పలుకుతాం.

 స్కాట్ బెస్సెంట్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ