calender_icon.png 28 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి సేకరణ సగమే

28-01-2026 01:16:57 AM

  1. ఈ ఏడాది లక్ష్యం 28.29 లక్షల టన్నులు
  2. ఇప్పటివరకు 14.96 లక్షల టన్నులు మాత్రమే సేకరణ
  3. సీసీఐ కొర్రీలతో అమ్మకానికి రైతుల వెనుకడుగు
  4. దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్న వైనం

నత్తనడకన కొనుగోళ్లు

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పత్తి పంట కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడా ది 45.32 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 28.29 లక్షల టన్ను ల పత్తిని సేకరించాలని సర్కార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 14.96 లక్షల టన్నులు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు సేకరించారు. ఇంకా ప్రభు త్వం అంచనా మేరకు దాదాపుగా 13.23  లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంది.

పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా లక్ష్యం లో సగం పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. పత్తి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం వేసే సమయంలో సవాలక్ష కొర్రీలు పెడుతుండడంతో రైతు లు ప్రభుత్వ సెంటర్ల వద్దకు అరకొరగా పత్తిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తేమ శాతంలో నిబంధనలు, కిసాన్ యాప్, ధర ల విషయంలో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా కేంద్రా ల్లో కొనుగోళ్లు మందగించాయి.

తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని మొన్నటివరకు రైతులు ధర్నాలు, ఆందోళనలు కూడా చేశారు. పత్తి కొనుగోలు చేయడానికి రాష్ర్టంలో 336 జిన్నింగ్ మిల్లులను ప్రారంభించారు.  వాటిలో స్టేఫుల్ కాటన్ క్వింటాల్ రూ. 7,710, లాంగ్‌స్టేఫుల్ పత్తి రూ. 8,110 ధర వరకు కొనుగోలు చేశారు. ఎకరానికి ఏడు క్వింటాళ్ల చొప్పన మాత్రమే పత్తిని కొనగోలు చేయడానికి సీసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 80,8132 మం ది రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసింది.

దీని విలువ రూ. 1,188 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ. 1,037 కోట్లు రైతుల ఖా తాలో జమ చేసింది. మిగతా నగదును కూ డా త్వరలో జమ చేయనున్నారు. పత్తి సేకరణలో నల్లగొండ జిల్లా టాప్‌లో నిలిచింది. 1.37 లక్షల టన్నులను సేకరించగా, ఆదిలాబాద్ జిల్లా రెండో వరుసలో నిలిచి 1.27 లక్షల టన్నులు కొనుగోలు చేసింది.

ఆ తర్వా త వరంగల్ జిల్లా 1.14 లక్షల టన్నులు, కొ మురభీం ఆసిఫాబాద్ 1.10 లక్షల టన్నులు, సంగారెడ్డి జిల్లా 1.01 లక్షల టన్నుల చొ ప్పున కొనుగోలు చేశాయి. అతి తక్కువగా  జగిత్యాల జిల్లాలో 1,448 టన్నులు, మెదక్ జిల్లా 4,423 టన్నులు, వనపర్తి 5,749  టన్నుల చొప్పున సేకరణ జరిగినట్లు అధికారుల గణంకాలు వెల్లడిస్తున్నాయి. 

దళారుల పత్తికి వెంటనే తూకం..

ఈ ఏడాది సీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తిని మా త్రమే  కొనుగోలు చేయడంతో రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దకు పంట  తీసుకెళ్లేందుకు వెనడుగు వేస్తున్నారు. తక్కువ ధర అయినా సరే మధ్య దళారులనే ఆశ్రయించారు. అదే పత్తిని దళారులు సర్కార్ కేంద్రాలకు తీసుకువెళితే వెంటనే తూకం వేశారని ఆరోపణలు ఉన్నాయి. ఐదు ఎకరాలు ఉన్న రైతు 35 క్వింటాళ్లు మాత్రమే కేంద్రాల వద్ద విక్రయించాలనే నిబంధనతో మిగతా పత్తి ఎక్కడ అమ్మాలో  తెలియక, గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది.

వారు కూడా ఇదే అదనుగా భావించి దోపిడీకి తెగబడి రైతుల వద్ద పత్తి నాణ్యత లేదని సాకులు పెడుతూ క్వింటా రూ. 6,100కే కొనుగోలు చేశారు. కొందరు రైతులు ఎక్కువ పత్తి పండిస్తే స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి వచ్చింది. సదరు రైతు తమకు ఎకరానికి 10 క్వింటాళ్లకుపైగా పత్తి పండినట్లు దరఖాస్తు పెట్టుకుంటే వారు వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పంట వేసినట్లు ధ్రువీకరణ చేస్తే కేంద్రాల నిర్వాహ కులు తూకం వేస్తారు. వ్యవసాయ శాఖ అధికారి పరిశీలన చేసిన తరువాత ఆన్‌లైన్ వివరాలు పెట్టేవరకు వేచిచూడాలి.

అదే విధంగా కేంద్ర ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ కూడా రైతులను ఇబ్బందులు పెట్టిం ది. స్లాట్ బుకింగ్ కావాలంటే వారం రోజుల సమయం పడుతోంది. సీసీఐ పెట్టిన సమయంలో దళారులకు మాత్రమే స్లాట్ దొరకుతుందని,  నిజమైన రైతులు దొరకడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ని కష్టాల మధ్య రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపలేదు. 

గతేడాది తెలంగాణ టాప్

పత్తి సేకరణలో 2024-25లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలి చింది. రాష్ర్టం నుంచి 40 లక్షల పత్తి బేళ్లు సేకరించినట్లు కేంద్రం వెల్లడించిం ది. ఆ తర్వాత స్థానంలో 30లక్షల బేళ్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణకు, మహారాష్ట్రకు మధ్య 10 లక్షల బేళ్ల వ్యత్యాసం ఉంది.

గుజరాత్ 14 లక్షల బేళ్లు, కర్ణాటక 5 లక్షల బేళ్లు, మధ్యప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఒడిశా 2లక్షల బేళ్లు, హరియాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు 1.15 లక్షల బేళ్ల చొప్పున మాత్రమే సేకరించాయి. దేశ వ్యాప్తంగా మద్దతు ధర కింద 100 లక్ష ల బేళ్లకు సమానమైన 525 లక్షల క్విం టాళ్ల విత్తన పత్తిని కేంద్రం సేకరించింది. తెలంగాణలో సుమారు 4.43 లక్షల మంది రైతులు పత్తి విక్రయించారు.