28-01-2026 12:53:59 AM
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): లాసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సెట్స్ కమిటీ సమావేశంలో వైస్‌చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్‌వెంకటేష్, ఈసెట్ చైర్మన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురం, ఈసెట్ కన్వీనర్ పీ.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అనంతరం ఈ రెండు సెట్స్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 5న విడుదల కానుంది. అదే నెల 9 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువిచ్చారు. మే 15న ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
మే 18న లాసెట్....
లాసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను అదేనెల 10 వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు, లేట్ ఫీజుతో మే 13 వరకు గడువిచ్చారు. మే 18న ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు. ఎల్‌ఎల్‌బీ(3 సం.) అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సు అభ్యర్థులకు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు పరీక్షను నిర్వహిస్తారు.
ఎప్‌సెట్‌కు మాక్‌కౌన్సిలింగ్
గతేడాది ఎప్‌సెట్‌కు ఒకేసారి మాక్‌కౌన్సిలింగ్‌ను నిర్వహించగా ఈసారి రెండు మూడు విడతల్లో ఎప్‌సెట్ అభ్యర్థులకు మాక్ కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ఆయనను కలిసిన విలేకరులకు తెలిపారు. అదేవిధంగా జీయో ట్యాగింగ్ ఈసారి అన్ని సెట్స్‌కు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకుంటారని తెలిపారు.
అదేవిధంగా అమ్మాయిలు ఇబ్బందులు పడకుండా వారిక సమీపంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఐసెట్, ఎడ్‌సెట్స్ కమిటీల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 30 వరకు అన్ని సెట్స్ కమిటీల సమావేశాన్ని పూర్తి చేయనున్నారు. చివరి రోజు ఎప్‌సెట్ కమిటీ సమావేశమై అదే రోజు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నది.