27-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): వెంట తుపాకులు పట్టుకున్న బాడీగార్డ్స్.. వాహనాలకు పోలీసు సైరన్లు.. చేతిలో వాకీటాకీలు.. తాను ఒక పవర్ ఫుల్ ఐఏఎస్ అధికారినని, ఎన్‌ఐఏలో పనిచేస్తున్నానని నమ్మబలికి వరుస మోసాలకు పాల్పడుతున్న బత్తిని శశికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసులు వివారలు వెల్లడించారు. చంపాపేటకు చెందిన బత్తిని శశికాంత్ (39) 3-డి ఏనిమేషన్ కోర్సు చేసి చిన్న కంపెనీ ఏర్పాటు చేశాడు.
ఇతని స్వస్థలం ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఇటీవల షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్టుమెంట్కు మకాం మార్చాడు. నేర్చుకున్న ఏనిమేషన్ కోర్సును ఉపయోగించి తన పేరిట నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఎస్‌ఐఏ అధికారుల గుర్తింపు కార్డులు తయారు చేశాడు. తమిళనాడుకు చెందిన విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమలు గన్మెన్లుగా నియమించుకున్నాడు. గన్మెన్లతో కలిసి షేక్‌పేటలోని గోల్డ్ జిమ్‌కు వెళ్లేవాడు.
కసరత్తు చేస్తున్న సమయంలో ఫోన్ రింగ్కాగా ప్రత్యేక ఆపరేషన్‌కు వెళుతున్నానంటూ హడావిడిగా జిమ్ నుంచి బయటికి వెళ్లేవాడు. కారుకు పోలీసు సైరన్లు పెట్టుకుని, చేతిలో వాకీటాకీలు పట్టుకుని తిరుగుతూ తాను ఒక ఉన్నతాధికారినని అందరినీ భ్రమలో ఉంచాడు. నకిలీ ఐడీ కార్డులను చూపిస్తూ అమాయకులను బోల్తా కొట్టించాడు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు చెందిన ఫోర్జరీ లెటర్లను సృష్టించిన శశికాంత్, వాటి ద్వారా ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు.
ఈ క్రమంలో గోల్డ్స్ జిమ్ యజమాని అలీ హసన్‌ను మభ్యపెట్టి రూ. 10 లక్షలు, అదే జిమ్ సూపర్ వైజర్ నుంచి రూ. 8 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా తాను అద్దెకు ఉంటు న్న ఇంటి యజమానిని సైతం బురిడీ కొట్టిం చి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నాడు. బాధితులు మోసపోయామని గ్రహించి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించడంతో శశికాంత్ లీలలు వెలుగులోకి వచ్చాయి.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శశికాంత్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వాకీటాకీలు, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తికి రక్షణగా ఉన్నందుకు గాను, తమిళనాడుకు చెందిన ఇద్దరు గన్‌మెన్లపైనా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు.