06-11-2025 01:34:36 PM
కామారెడ్డి కలెక్టరేట్లో ఒక మహిళ చీటింగ్
ఉద్యోగం వచ్చిందని నమ్మించేందుకు యత్నం
గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇస్రత్
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో ఓ మహిళ తాను కలెక్టర్ ను అంటూ తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్ గా ఉత్తర్వులు ఇచ్చినట్లు నమ్మించేందుకు ప్రయత్నించిన మహిళ చివరికి నకిలీ ఐ ఏ ఎస్(Fake IAS Officer) గా తేలిన సంఘటన కామారెడ్డిలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.తాను ఐఏఎస్‌నని, ఇంచార్జి కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో ఒక మహిళ కామారెడ్డి కలెక్టరేట్‌లో హంగామా చేసింది. అసలు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సెలవులో ఉండడంతో నిజామాబాద్ కలెక్టర్‌కు వినయ్ కృష్ణారెడ్డికి ఇంచార్జి కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కామారెడ్డి కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
ఇంచార్జి కలెక్టర్‌గా తనను నియమించారని నకిలీ ఉత్తర్వులు చూపగా అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్ మదన్ మోహన్ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, పైనుంచి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని ఆమెకు తెలిపారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో కలెక్టరేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద నకిలీ ఐఏఎస్ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. 2020 నుంచి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫలయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి ఆమెను వదిలేసినట్లు సమాచారం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె హడావిడిని చూసి అనుమానం వచ్చిన అధికారులకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కామారెడ్డికి అదనపు కలెక్టర్గా ఎవరికి ఇవ్వలేదని చెప్పడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం తేల్చారు.