05-05-2025 01:10:11 AM
అమరనేతల ఆశలకు అనుగుణంగా నడుచుకోవాలి : తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం మే 4 (విజయక్రాంతి) సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధులు, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆళ్ల గురుప్రసాద రావుకు సిపిఐ, ప్రజాసంఘాల శ్రేణులు, అభిమానులు, న్యాయవాదులు ఘన వీడ్కోలు పలికారు. 93 ఎడ్ల గురుప్రసాద్ వృద్ధాప్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని తన బంధువు ల గృహంలో మృతి చెందారూ.
అయన భౌతికకాయాన్ని ఆదివారం పార్టీ శ్రేణులు, ప్రజల సం దర్శనార్ధం సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’కు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్యవర్గ సభ్యులు బి అయోధ్యతోపాటు పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వై ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో కూనంనేని మాట్లాడారు. గురుప్రసాద రావు ఉత్తమ కమ్యూనిస్టు అని, తన తుది శ్వాస వరకు ప్రజా సేవకే అంకితమయ్యారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారన్నారు.ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణం, విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేశారని, అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్ది కమ్యూనిస్టు పార్టీకి అందించారన్నారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, పరిసర మండలాల్లో రాజాకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గురుప్రసాద్ అని, ప్రజాఉద్యమాలతో కమ్యూనిస్టు పార్టీ ప్రతి ష్టను, జిల్లా ప్రతిష్టను పెంచిన వ్యక్తి అని, ఎలాంటి పదవులను ఆశించకుండా కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారన్నారు .అయన మృతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను తీరని లోటని, అమర నేతల ఆశయాల సాధన దిశగా ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు.
అనంతరం శేషగిరిభవన్ నుంచి కొత్తగూడెం వైద్య కళాశాల వరకు జనసందోహం నడుమ అంతిమయాత్ర జరి గింది.కుటుంబ సభ్యుల కోరిక మేరకు గురుప్రసాద్ భౌతికకాయాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం కొత్తగూడెం వైద్య కళాశాలకు అప్పగించారు.
నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, తాటి వెంకటేశ్వర్లు, పాకలపాటి పెద్దబ్బాయి, ప్రముఖ వైద్యులు రమే ష్ బాబు, రామ్మోహనరావు, పట్టాభి, లాయర్స్ అసోసియేషన్ నాయకులు లక్కినేని సత్యనారాయణ,రాధాకృష్ణ, కోటం రాజు, ఎల్లంకి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, జి వీరాస్వామి, వి మల్లికార్జున్ రావు, కంచర్ల జమలయ్య, వున్నారు.