05-01-2026 03:56:10 PM
తుంగతుర్తి తాసిల్దార్ ,తుంగతుర్తి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
కేతిరెడ్డి సౌజన్య దేవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల ఆందోళన.
తుంగతుర్తి,(విజయక్రాంతి): పోలీసుల విచారణ చేస్తుండగా గుండెపోటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం 2007వ సంవత్సరంలో కేతిరెడ్డి విజయసేనారెడ్డి చెందిన 11 ఎకరాల భూమిని, రావులపల్లి గ్రామానికి చెందిన జోగునూరి లాజరస్ కొనుగోలు చేశాడు. నాటి నుండి నేటి వరకు కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తుండగా, ఇటీవల కాలంలో అతనికి తెలవకుండా విజయసేనారెడ్డి భార్య సౌజన్య దేవి మరియు ఆమె కూతుళ్లు తుంగతుర్తి తాసిల్దార్ దయానందం సంప్రదించి, మాట్లాడుకొని రైతుకు తెలవకుండానే 2 ఎకరాల 20 గుంటల భూమిని, కనీసం రైతుకు నోటీసు ఇవ్వకుండా తాసిల్దార్ పట్టా చేశారు.
భూమి వివాదం కొనసాగుతుండగా ఇటీవల జనవరి 2తుంగతుర్తి తాసిల్దార్ కేంద్రంలో న్యాయం చేయాలని కోరుతూ ఆయనతో పాటు కొంతమంది రైతులు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై సోమవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బాధిత రైతులతో తుంగతుర్తి సిఐ నరసింహారావు విచారణ జరుపుతుండగా, ఒకేసారి గుండెపోటు రావడంతో, కుప్పకూలగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు, సౌజన్య రెడ్డి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ధర్నా కార్యక్రమం చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తుంగతుర్తి తాసిల్దార్ దయానందం, ఎస్సై క్రాంతి కుమార్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నారు.