22 July, 2026 | 2:12 AM

టేకులపల్లిలో వర్షం

22-07-2026 01:39 AM

టేకులపల్లి, జులై 21(విజయక్రాంతి):  ఎన్నో రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న టేకులపల్లి మండల రైతులకు మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. దుక్కులు పూర్తి చేసి, విత్తనాలు విత్తిన రైతులు వర్షాభావంతో ఆందోళన చెందుతుండగా, ఈ వర్షం వారికి ఆశాజనకంగా మారింది. మండలంలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే మొలకెత్తిన పత్తి మొక్కలు గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండ తీవ్రతకు వాడిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో కురిసిన వర్షం పంటలకు జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తేమ పెరగడంతో పంటల ఎదుగుదలకు ఈ వర్షం ఎంతో ఉపయోగ పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే భారీ వర్షం కారణంగా టేకులపల్లిలోని కొన్ని కాలనీలు, తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ఇళ్లలోకి చేరిన నీటిని వెంటనే తొలగించేలా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.