20 April, 2026 | 4:31 AM

తహశీల్దార్ హెచ్చరిక బోర్డుతో రోడ్డు ఎక్కిన రైతులు

08-12-2024 11:49 PM

ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని లాక్కుంటున్నారా...

ఏకంగా 126 ఎకరాల భూమిని లాక్కుంటున్నారు

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గోపాలరావుపేట గ్రామ శివారులో శనివారం రవి అస్తమిస్తున్న సమయంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పరిధిలోని 126.07 ఎకరాల భూమినీ ప్రభుత్వ భూమి స్వాధీనం హెచ్చరిక బోర్డుతో గ్రామం ఒక్కసారి ఉలిక్కి పడింది. అకస్మాత్తుగా వచ్చి నవోదయ స్కూల్ నిర్మాణం కొరకు భూమిని ఆక్రమించుకుంటున్నామంటూ బోర్డు పెట్టడంతో ఆదివారం రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనకు దిగారు. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో దాదాపు 100 మంది సన్నా, చిన్న కారు రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ భూమిని అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా ప్రకటించి, స్కూల్ నిర్మాణం కోసం తీసుకోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "నవోదయ స్కూల్ పినపాక మండలానికి రావడం నిజంగా హర్షించదగిన విషయం. కానీ, రైతుల భూములు లాక్కోని స్కూల్ నిర్మిస్తామని చెప్పడం అన్యాయం అంటున్నారు. ఖాళీ స్థలం ఎక్కడా లేదా? మా జీవనాధారమైన పొలాలను తీసుకుంటే, మా బ్రతుకులు వీధిన పడతాయి.

మాకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోతుందని లబోదిబోమంటున్నారు. "పొడు భూములకే ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే, మా పంట పొలాలకు, పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు? మా భూములను ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని మేము ఒప్పుకోము. గ్రామంలో ఖాళీ స్థలంలో స్కూల్ నిర్మిస్తే మేము కూడా హర్షిస్తాం. కానీ మా పొలాలను తీసుకోవడాన్ని అడ్డుపడతాం అంటున్నారు. రైతులు వారి బాధను వివరిస్తూ, ఈ భూములపై మూడు తరాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు ఈ భూములు లేకపోతే, మేము మరో చోట కొనుగోలు చేసుకునే ఆర్థిక స్తోమత కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి మా భూముల జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారం గ్రామ ప్రజలందరికీ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతుల ఆకాంక్షలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని, రైతుల పంట భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవన విధానాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.